
- రూ.15 వేలు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్
- రహదారిపై బైఠాయించి ఆందోళన
మెట్ పల్లి, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పసుపునకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం మెట్పల్లి పట్టణంలో పసుపు రైతులు మహాధర్నా నిర్వహించారు. రెండు గంటలకు పైగా హైవేపై రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పసుపు ధరలు రోజురోజుకు తగ్గుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదే సీజన్ లో రూ.18 వేలు ధర ఉందని, ప్రస్తుతం రూ.8 వేలు దాటడం లేదన్నారు. పసుపు బోర్డు వస్తే మంచి రేటు వస్తుందని, తమ కష్టాలు తీరుతాయని భావించామని పేర్కొన్నారు. కేరళలో మాదిరిగా ప్రతి పంటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత మద్దతు ధర నిర్ణయించాలని కోరారు.
వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో రూ.8 వేలకు వచ్చే డ్రిప్ యూనిట్ ధర రూ.35 వేలకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్పైసెస్, పసుపు బోర్డు పేరుతో కేంద్రం, మద్దతు ధర అంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
పంట డబ్బులు ఇచ్చేందుకు వ్యాపారులు 2 శాతం క్యాష్ కటింగ్ చేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ, సాంగ్లి, స్థానిక వ్యాపారులు సిండికేట్ గా మారి ధర తగ్గిస్తూ రైతులను దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మార్కెట్ ఆఫీస్ నుంచి రైతులు భారీ ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో శ్రీనివాస్ కు అందజేశారు. రైతు సంఘం నాయకులు, రైతులు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.